: సిరిగోల్డ్ ఎండీ అరెస్ట్
రెండేళ్లలో మీ డబ్బును రెట్టింపు చేసి ఇస్తామని నమ్మించి, కోట్లాది రూపాయలను డిపాజిట్ల రూపేణా సేకరించి లక్షలాది మందిని నిండా ముంచేసిన సిరిగోల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ వి. సుందరంను పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. సిరిగోల్డ్ మనీ స్కీం పేరిట 2008లో నెల్లూరు కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించిన సుందరం, స్వల్ప కాలంలోనే వేలాది మంది ఏజెంట్లను నియమించుకుని పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించారు. అయితే కాలపరిమితి ముగిసినప్పటికీ తమ డిపాజిట్ సొమ్ము తిరిగి రాకపోవడంతో డిపాజిట్ దారులు సంస్థపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలోనే సుందరం నెల్లూరు, కావలి, గూడూరు తదితర బ్రాంచ్ లను దశల వారీగా మూసివేశాడు. పరిస్థితిని అవగతం చేసుకున్న డిపాజిట్ దారులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తొలుత సంస్థ డైరెక్టర్ రమేశ్ బాబును అరెస్ట్ చేశారు. సిరిగోల్డ్ వ్యవహారమే కాక ఇటీవల సీతారామపురం పరిసరాల్లో సుందరం రూ. 2 కోట్ల మేర ఆర్థిక మోసాలకు పాల్పడ్డట్లు ఫిర్యాదులందుకున్న పోలీసులు ఉదయగిరిలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.