: 9 నెలల్లో 9 క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరణ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 9 నెలల్లో తొమ్మిది క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించారు. దీంతో 14 మంది దోషులకు మరణశిక్ష అమలుకానుంది. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. తన పదవికాలంలో నెలకు ఒక పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరిస్తూ వచ్చినట్లయింది. కాగా, గతంలో రాష్ట్రపతిగా పనిచేసిన శంకర్ దయాళ్ శర్మ తన ఐదు సంవత్సరాల పదవీకాలంలో 14 పిటిషన్లు తిరస్కరించారు. రాష్ట్రపతిగా విధులు నిర్వహించిన కేఆర్ నారాయణ ఎలాంటి కేసును పరిశీలించక పోవడం గమనార్హం. అంతకుముందు రాష్ట్రపతులుగా పనిచేసిన ఏపీజే అబ్ధుల్ కలామ్ ఒక పిటిషన్ ను, ప్రతిభా పాటిల్ మూడు పిటిషన్ లను తిరస్కరించారు.
ఇక, ప్రణబ్ పిటిషన్ ల తిరస్కరణ విషయానికి వస్తే.. మొదటిసారి ముంబయి పేలుళ్ల దాడి నిందితుడు అజ్మల్ కసబ్ పిటిషన్ తో మొదలయింది. నవంబర్ 2012 లో కసబ్ క్షమాభిక్ష పిటిషన్ ను ఆయన తోసిపుచ్చారు. దీంతో 2004 తర్వాత మొదటిసారి భారత ప్రభుత్వం ఉరిశిక్ష అమలుచేసింది. అనంతరం జనవరి 4న సాయిబన్నా నిన్ గప్పా నాటికర్, ఫిబ్రవరి 3న పార్లమెంటు దాడి నిందితుడు అఫ్జల్ గురుల పిటిషన్ లను తిరస్కరించారు. మందుపాతర పేలుడులో 22 మంది మరణానికి కారకులైన 8 మంది దోషుల క్షమాభిక్ష పిటిషన్ లను ఫిబ్రవరి, మార్చి మధ్యలో ప్రణబ్ నిరాకరించారు.