: ధరల అదుపుపై పార్లమెంటులో దుమ్మురేపిన మహేష్ బాబు బావ


ధరల అదుపుపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంటులో స్ఫూర్తి దాయక ప్రసంగం చేశారు. బడ్జెట్ పై కొత్త ఎంపీలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంతో లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, వర్షాధార భారత దేశంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఈ పరిస్థితులను అధ్యయనం చేస్తే భవిష్యత్ తరాలు భారీ ఆహార కొరతను ఎదుర్కోనున్నాయన్న విషయం అర్ధమవుతోందని ఆయన హెచ్చరించారు. అలాంటి సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వం చేసిన తప్పులను ఎన్డీయే పునరావృతం చేయకూడదని ఆయన ఆశించారు. రైతులు పండించే పంటను నేరుగా వినియోగదారుడి వద్దకే చేర్చగలిగితే, రైతులను పీడిస్తున్న దళారీ వ్యవస్థ మటుమాయం అవుతుందని ఆయన సూచించారు. అందుకు చంద్రబాబునాయుడు ప్రవేశ పెట్టిన రైతుబజార్ అంశాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ఆయన సలహా ఇచ్చారు. అన్నపూర్ణగా పేరుగాంచి, అన్ని రకాల పంటలు పండే ఆంధ్రపద్రేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా నిల్వ (కోల్డ్ స్టోరేజ్ ) వ్యవస్థ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ముందుకు వచ్చి రైతుల కోసం కోల్డ్ స్టోరేజీ వ్యవస్థను రూపొందించగలిగితే దేశం దుర్భిక్షం బారిన పడకుండా కాపాడుకోగలమని ఆయన స్పష్టం చేశారు. రైతన్నను ఆదుకోవాలని, ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వాలు నడుం బిగించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News