: కేసీఆర్ కు సోమిరెడ్డి సవాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేతనైతే గురుకుల్ ట్రస్టు భూములు, అయ్యప్ప సొసైటీ, ఇతర నివాస, వాణిజ్య కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాలు విసిరారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 30, 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రజల ఇళ్లను కూల్చేసి, వారిని ఇక్కట్లపాలు చేసే బదులు ప్లానింగ్, పట్టాలు, అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సీమాంధ్ర ప్రజలపై కక్ష కట్టడం సరికాదని ఆయన హితవు పలికారు. తెలంగాణ రావడం ద్వారా ఆత్మ సంతృప్తి లభించిందని, దాని ముందు ఏ కీర్తి, కాంక్ష నిలవవని, సీమాంధ్రులను సోదరుల్లా చూసుకుంటామని, వారికే కష్టం రానివ్వమని చెప్పిన కేసీఆర్, సీమాంధ్ర ప్రజలు ఉండే ప్రాంతాలపై దాడులు, భూముల స్వాధీనం వంటి వన్నీ ఏ చర్యల కిందకి వస్తాయో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో సమస్యలు రాకుండా పరిపాలిస్తే కీర్తి నిలబడుతుంది కానీ, కక్ష సాధింపులు చరిత్రలో ఎవర్నీ ఉన్నతులను చేయలేదని కేసీఆర్ గుర్తించాలని ఆయన హితవు పలికారు. బంగారు తెలంగాణ నిర్మిస్తామని చెప్పి, అన్నింటినీ కూల్చేసి శిధిలాలు మిగులుస్తున్నారని ఆయన వెల్లడించారు. దేశంలో ఎవరైనా, ఎక్కడైనా నివసించవచ్చని, అలా నివసించిన వారిపై ఆంక్షలు ఉండవని ఆయన గుర్తు చేశారు. ఇంత విధ్వంసం జరుగుతుంటే ఉమ్మడి గవర్నర్ ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. గవర్నర్, ఇద్దరు సలహాదారులు ఇంట్లో కూర్చునేందుకు వారికి అధికారాలు కట్టబెట్టలేదని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూసేందుకే ఆయనను గవర్నర్ గా నియమించారని ఆయన స్పష్టం చేశారు.