: సోదరుడి తప్పుకు మైనర్ బాలిక జీవితం నాశనం
తన సోదరుడు చేసిన తప్పుకు ఓ మైనర్ బాలిక జీవితమే నాశనమై పోయింది. ఒకరు చేసిన తప్పుకు సదరు వ్యక్తి కుటుంబ సభ్యుల్లోనే మరొకరికి శిక్ష విధించి పంచాయతీ పెద్దలు తమ దాష్టీకాన్ని చాటుకున్నారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ లో వెలుగు చూసింది. రాష్ట్రంలోని బొకారా జిల్లా గుల్ గులియాధొరా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంచాయతీ పెద్దల అన్యాయమైన తీర్పుపై మైనర్ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాస్తం ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. తన భార్యపై ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పంచాయతీ పెద్దలను ఆశ్రయించాడు. అంతేకాక తనకు జరిగిన అవమానానికి సరైన రీతిలో నిందితుడికి శిక్ష విధించాలని పట్టుబట్టాడు. పంచాయతీ పెద్దలు కూడా ముందూవెనకా చూసుకోకుండా బాధితుడి తరఫున నిలిచేందుకే మొగ్గుచూపారు. ఈ క్రమంలో నిందితుడి సోదరి అయిన మైనర్ బాలికపై అత్యాచారం చేయాలంటూ బాధిత వ్యక్తికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. దీనిపై భగ్గుమన్న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తితో పాటు, మైనర్ బాలిక సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే అమానవీయకర రీతిలో మైనర్ బాలిక జీవితం నాశనమయ్యేందుకు కారకులైన పంచాయతీ పెద్దలపై మాత్రం పోలీసులు దృష్టి సారించిన పాపాన పోలేదు.