: ప్రియురాలి పెళ్లి ఆపబోయి... తన్నులు తిన్నాడు!
ప్రియురాలి పెళ్లి ఆపబోయి చావుదెబ్బలు తిన్నాడో భగ్నప్రేమికుడు. బెంగళూరుకు చెందిన వెంకటేష్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన మహాలక్ష్మి అనే యువతిని ప్రేమించాడు. మహాలక్ష్మికి వేరే వ్యక్తితో ఆమె కుటుంబ సభ్యులు వివాహం నిశ్చయించి, తిరుమల వెంకన్న సన్నిధిలో పెళ్లి జరిపేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వారి పెళ్లి తంతు తిరుపతిలోని పరకాల మఠంలో ప్రారంభమైంది. ఇంతలో రంగ ప్రవేశం చేసిన వెంకటేష్, తానూ మహాలక్ష్మి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, తనతోనే ఆమె వివాహం జరిపించాలని తెగ హంగామా చేశాడు. దీంతో, ఆమె బంధువులు అతనిని చావబాదారు. పెళ్లి చేసుకోవాలని మహాలక్ష్మిని వేధించేవాడని, ఇప్పుడు ఏకంగా పెళ్లి మంటపానికే వచ్చి ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు. అతనికి ఇంతకుముందే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఆమె బంధువులు తెలిపారు. కాగా, తాము నాలుగేళ్ల నుంచే ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేయమంటే దాడి చేశారని వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.