: విమానాలు ఇకపై మరోలా కూడా ఉపయోగపడతాయి!
ఆకాశ వీధిలో హాయిగా ఎగురుతూ ... కొన్నేళ్ళ పాటు ఈ దేశం నుంచి ఆ దేశానికి ప్రయాణించి, సేవలందించే విమానాలు కాలం తీరాక షెడ్డుకి వెళ్లిపోతుంటాయి. ఇప్పటి వరకు వీటిలోని 40 శాతం లోపు పరికరాలని మాత్రమే రీసైక్లింగ్ విధానం ద్వారా కరిగించి, వేరే ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. మిగతా 60 శాతం వృథా అయిపోతున్నాయి. అయితే, ఇకపై ఆ విమానాల ముక్కలు మన చేతిలో మొబైల్ ఫోన్ గానో... మన బైకులోని పార్టులుగానో కొత్త రూపం దాల్చనున్నాయి.
ఇందులో భాగంగా, ప్రముఖ విమాన తయారీ సంస్థలు ఎయిర్ బస్, బోయింగ్ సంస్థలు 'క్రాడిల్ టు క్రాడిల్' అనే విధానంలో తమ విమానాల్ని తయారు చేయాలని నిర్ణయించాయి. 2015నాటికి ఈ విధానంలోనే విమానాలను రూపొందిస్తాయట. ఈ విధానంలో తయారైన విమానాలు కాలం తీరిన తర్వాత వాటిలో 85 నుంచి 90 శాతం భాగాలు పునర్వినియోగానికి అనుకూలంగా మార్చుకోవచ్చు. విమానంలో అల్యూమినియం, టైటానియం, కాపర్, స్టెయిన్ లెస్ స్టీల్, ప్లాస్టిక్, వైర్లు తదితర భాగాలను మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఆటోమొబైల్ ఉపకరణాల తయారీలో వాడతారన్నమాట.