: నకిలీ ఐఏఎస్ హల్ చల్


ఎటూ యూపీఎస్సీ పరీక్షలు రాశాను కదా, ఐఏఎస్ అవతారం ఎత్తితే పోయేదేముందిలే అనుకున్నాడో ఏమో మరి... పరీక్షలు రాసేసిన వెంటనే ఐఏఎస్ అవతారం ఎత్తేశాడు ఢిల్లీకి చెందిన కబీర్ హష్మీ అనే బీకాం విద్యార్థి. అనుకున్నదే తడవుగా ముంబైకి చెందిన సర్వేశ్ కుమార్ అనే వ్యక్తిని కార్యదర్శిగా నియమించేసుకుని నేరుగా కర్ణాటకకు వెళ్లిపోయాడు. రిచ్ మండ్ కన్సల్టెన్సీ పేరిట ఓ సంస్థను నెలకొల్పి అక్రమాలకు తెర తీశాడు. క్రీడలు, యువజన సర్వీసుల శాఖలో ఉప కార్యదర్శినంటూ చెప్పి రాయచూర్ లోని నెహ్రూ యువ కేంద్రాన్ని పరిశీలించేందుకు వస్తున్నట్లు సదరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఢిల్లీ నుంచి సందేశం పంపాడు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలు కావడంతో రాయచూర్ జిల్లా ఇన్ చార్జి అధికారిణి జ్యోత్స్న ప్రభుత్వ గెస్ట్ హౌస్ ను ఏర్పాటు చేయడంతో పాటు అధికారిక వాహనాన్ని సిద్ధం చేశారు. తన పర్యటనలో భాగంగా తాను 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారినంటూ కబీర్ చెప్పడంతో, జ్యోత్స్న చెన్నైలోని తన జూనియర్ కు ఫోన్ చేసి కబీర్ గురించి ఆరా తీశారు. కబీర్ అనే వ్యక్తి 2007 బ్యాచ్ లో లేనేలేరన్న జూనియర్ సూచనతో అప్రమత్తమైన జ్యోత్స్న, విషయాన్ని పోలీసులకు నివేదించారు. రంగప్రవేశం చేసిన పోలీసులు కబీర్ నకిలీ రూపాన్ని వెలుగులోకి తెచ్చారు. అతడితో పాటు అతడికి సహకరించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఐఏఎస్ నంటూ పలువురు నిరుద్యోగుల వద్ద వసూలు చేసిన రూ. 15 లక్షల మేర సొమ్మును రికవరీ చేశారు. అంతేకాదండోయ్, మనోడు ఓ రాజకీయ నేతనూ బుట్టలో వేసేశాడు. రాయచూర్ లోని ఏపీఎంసీలో డైరెక్టర్ పదవి ఇప్పిస్తానంటూ రూ. 12 లక్షల మేర వసూలు చేశాడట.

  • Loading...

More Telugu News