: పట్టపగలు ఎంపీ నివాసంలో దొంగలు పడ్డారు!
బీహార్లో సామాన్యులకే కాదు, సాక్షాత్తూ పార్లమెంటు సభ్యులకూ రక్షణ లేదని తాజా ఘటన చాటుతోంది. నవాడా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గిరిరాజ్ సింగ్ నివాసంలో దొంగలు ప్రవేశించారు. పాట్నాలో పట్టపగలే ఈ ఘటన చోటుచేసుకోవడం పోలీసులను నివ్వెరపరిచింది. దొంగలు మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి చొరబడ్డారు. అయితే, విలువైన వస్తువులు చోరీ అయినట్టు తెలియరాలేదు. ఆ సమయంలో ఎంపీ ఇంటి పనిమనుషులు సదానంద్, లక్ష్మణ్ అక్కడలేరు. ఘటనపై ఎంపీ గిరిరాజ్ స్పందిస్తూ... "ఏమేమి చోరీకి గురయ్యాయన్నది ఇక్కడ అప్రాధాన్య అంశం. ఓ ఎంపీ ఇంట్లోకి పట్టపగలే దొంగలు ప్రవేశించడం చూస్తుంటే... శాంతిభద్రతలు ఏ రీతిలో ఉన్నాయో, నేరగాళ్ళ అరాచకత్వం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.