: బదౌన్ బాలికల మృతదేహాలకు రీపోస్ట్ మార్టం
ఉత్తరప్రదేశ్ లో సంచలనం రేపిన బదౌన్ ఘటనలో అత్యాచారం, ఆపై హత్యకు గురైన ఇద్దరు బాలికల మృతదేహాలకు మరోసారి పోస్ట్ మార్టం నిర్వహించాలని తాాజగా సీబీఐ నిర్ణయించింది. 14, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలను ఐదుగురు వ్యక్తులు సామూహికంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఓ చెట్టుకు వేలాడదీసిన ఘటన ఈ ఏడాది మేలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఘటనకు సంబంధించిన అన్ని వైపుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమైన విషయమూ విదితమే. ఈ నేపథ్యంలోనే ఈ కేసు దర్యాప్తును యూపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. కేసు విచారణ బాధ్యతలు స్వీకరించిన సీబీఐ అధికారులు ఈ దారుణానికి ఒడిగట్టిన ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు విచారణలో భాగంగా సత్యశోధన, పాలీగ్రాఫ్ తదితర పరీక్షలు నిర్వహించారు. అయితే, నిందితుల వాంగ్మూలాల్లో వైరుధ్యాలున్న నేపథ్యంలో బాలికల మృతదేహాలకు రెండోసారి పోస్ట్ మార్టం నిర్వహించడం మినహా మరోమార్గం సీబీఐ అధికారులకు కనిపించలేదు. దీంతో బాలికల మృతదేహాలను వెలికి తీసి రెండో సారి పోస్ట్ మార్టం చేయనున్నారు.