: 'ఆ అమ్మాయిలు ఎందరో లెక్కతేల్చండి'... బీజేపీ నేత వ్యాఖ్యలపై దుమారం
బీహార్ నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి హర్యానా అబ్బాయిలకు పెళ్లి చేస్తానన్న బీజేపీ నేత ఓపీ ధన్ కడ్ వ్యాఖ్యలు పెనుదుమారాన్నే రేపాయి. దీనిని బీహార్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బీహార్ నుంచి ఎంతమంది అమ్మాయిలు హర్యానాకు వధువులుగా వెళ్లారు? అన్నది లెక్కలతో నిగ్గుతేల్చాల్సిందిగా 12 జిల్లాల ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హర్యానా అబ్బాయిలను పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఇష్టపూర్వకంగా పెళ్లిళ్లు చేసుకున్నారా? లేక ప్రలోభాలకు, పెద్దల నిర్ణయాలకు లోబడి బలవంతంగా పెళ్లిళ్లు చేసుకున్నారా? అనే కోణంలో విచారణ చేయాల్సిందిగా ఎస్పీలను ఆదేశించింది.
భ్రూణ హత్యలు చోటుచేసుకోవడంతో అమ్మాయిల జనాభా తగ్గి హర్యానాలో 'పెళ్లి కాని ప్రసాదులు' పెరిగిపోతున్నారు. దీంతో, ఎదురు కట్నం ఇచ్చి బీహార్ యువతులను హర్యానా అబ్బాయిలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే, ఇంకా పెళ్లికాని హర్యానా అబ్బాయిలకు బీహార్ అమ్మాయిలతో పెళ్లిళ్లు జరిపిస్తామని బీజేపీ నేత ధన్ కఢ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై బీహార్ నేతలు మండిపడుతున్నారు.