: విధి చిన్న చూపుచూస్తే... ఆ తల్లిదండ్రులు మానవత్వం మరిచారు!
కేరళలో అన్నెం పున్నెం ఎరుగని 13 మంది చిన్నారులకు హెచ్ఐవీ సోకింది. వారిని చదివించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. వారిని సులోర్చన గ్రామంలోని డాన్ బాస్కో స్కూల్ లో జాయిన్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఈ పాఠశాల ఫాదర్ కూడా ఆమోదం తెలిపారు. వారిని అక్కున చేర్చుకుని అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందజేస్తామని స్కూల్ ఫాదర్ తెలిపారు. ఇంతలో పేరెంట్స్ మరియు టీచర్స్ అసోసియేషన్ అభ్యంతరం చెప్పింది. తమ పిల్లల పక్కన ఎయిడ్స్ సోకిన పిల్లలు కూర్చొనేందుకు తాము ఒప్పుకోమంటూ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో, ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. ఈ వార్త కేరళ మొత్తం వ్యాపించడంతో వారిని తమ పాఠశాలలో చేర్చుకుంటామని ఫాతిమా హైస్కూల్ ముందుకు వచ్చింది. అక్కడ కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అదే స్పందన వ్యక్తమైంది. తాము సాహసం చేసేందుకు సిద్ధంగా లేమని, తమ పిల్లలను వారితో కూర్చోబెట్టేందుకు ఒప్పుకోమని స్పష్టం చేశారు. దీనిపై ఎంత పోరాటానికైనా వెనుకాడబోమని పేరెంట్స్ అసోసియేషన్ వెల్లడించింది. దీంతో, కేరళ ప్రభుత్వం పిల్లలను పెంచిన రోమన్ క్యాథలిక్ సిస్టర్స్ ను వారివద్దకు రాయబారానికి పంపించింది. ఆ 13 మంది పిల్లలను ఇప్పటివరకు నిత్యసేవా నికేతన్ అనే క్యాథలిక్ సంస్థ చేరదీసి ఆశ్రయం కల్పించి విద్యాబుద్ధులు చెప్పింది. వారు పెరిగి పెద్దవారౌతుండడంతో వారికి సమాజంలో స్థానం కల్పించాలని కాంక్షించి స్కూల్ లో జాయిన్ చేసేందుకు ప్రభుత్వాన్ని సహాయం కోసం అర్ధించింది. నన్స్ నిబంధనల మేరకు ఓ స్థాయి విద్యార్థులను తమ వద్ద ఉంచుకోరు.