: 'బ్రహ్మోస్' గ్రాండ్ సక్సెస్
భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ మిస్సైల్ బ్రహ్మోస్ మరోసారి విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్ టెస్టింగ్ రేంజ్ నుంచి దీన్ని ఈ ఉదయం ప్రయోగించారు. దీని పరిధి 290 కిలోమీటర్లు కాగా, 300 కిలోల సంప్రదాయ వార్ హెడ్ ను తీసుకువెళ్ళగలదు. తాజా ప్రయోగంపై చాందీపూర్ టెస్టింగ్ రేంజ్ డైరక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ మాట్లాడుతూ, నేటి ప్రయోగం సక్సెసయిందని తెలిపారు. నేడు తాము ప్రయోగించింది సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్ (భూతలం నుంచి భూతలంలోని లక్ష్యాన్ని ఛేదించే క్షిపణి) అని వెల్లడించారు. ఈ క్షిపణికి పూర్తిగా దేశీయంగా తయారైన ఎయిర్ ఫ్రేమ్ ను వాడామని చెప్పారు. భారత్, రష్యాల జాయింట్ వెంచర్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఈ సూపర్ సోనిక్ మిస్సైల్ రూపకర్త. ఇది 2.8 మాక్ స్పీడుతో ప్రయాణిస్తుంది. దీని వేగం అమెరికా అమ్ములపొదిలోని టోమహాక్ క్రూయిజ్ మిస్సైల్ కంటే మూడురెట్లు అధికం. సబ్ మెరైన్లు, యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్ల నుంచి దీన్ని ప్రయోగించే వీలుంది. భూ ఉపరితలం, సముద్రం నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులను ఇప్పటికే పలు దఫాలు విజయవంతంగా పరీక్షించిన భారత్... వాటిని ఆర్మీతో పాటు నేవీకి అందించింది.