: 16 ఏళ్ల పాటు గర్భం రానివ్వదు
అప్పుడప్పుడే పిల్లలు వద్దనుకునే జంటలకు 2018లో ఓ మహత్తర పరికరం అందుబాటులోకి రానుంది. కొత్తగా పెళ్లయిన జంటలు కొంత కాలం పాటు పిల్లలు వద్దనుకుంటుండటం చూస్తూనే ఉన్నాం. ఇందుకోసం గర్భ నిరోధక మాత్రలు, కండోమ్ లు, కాపర్ టీలు తదితరాలను ఆయా జంటలు ఎంచుకుంటున్నాయి. అయితే, వీటితో సదరు జంటలు కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న మాట కాదనలేని సత్యమే. అంతేకాక, ఎప్పటికప్పుడు ఈ పద్దతుల కోసం మెడికల్ షాపులకో, వైద్యుల వద్దకో వెళ్లక తప్పని పరిస్థితి. ఈ తరహా జంటలకు ఓ శుభవార్త. కేవలం రెండు సెంటీమీటర్ల చొప్పున పొడవు, వెడల్పుతో మొబైల్ చిప్ లా ఉండే ఈ పరికరాన్ని ఒక్కసారి శరీరంలో అమర్చుకుంటే సరి. ఏకంగా 16 ఏళ్ల పాటు పిల్లలు కలగకుండా చూసుకోవచ్చు. అంతేకాదండోయ్, ఈ పరికరంతో పాటు వచ్చే ఓ రిమోట్ తో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్, ఆఫ్ చేసుకోవచ్చట. ఇక ఎప్పుడైనా కుటుంబ నియంత్రణను అటకెక్కిద్దామనుకున్న జంటలు, ఒక్కసారి రిమోట్ మీటతో ఎంచక్కా పిల్లలను కనేయడానికి సిద్ధమైపోవచ్చు. చిప్ లా ఉండే ఈ చిన్న పరికరంలో గర్భనిరోధకమైన లెవొనోర్జెస్ట్రెల్ అనే ఔషదం ఉంటుందట. ఈ ఔషదం రోజూ 30 మైక్రో గ్రాముల చొప్పున శరీరంలోకి విడుదలవుతుందట. అంతేకాక ఈ మోతాదును కూడా రిమోట్ సహాయంతో నియంత్రించుకోవచ్చట. మాసాచుసెట్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందిస్తున్న ఈ పరికరం దాదాపు తుదిరూపుకు వచ్చిందని సమాచారం. వచ్చే ఏడాది దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారట. 2018లో ఈ పరికరం మార్కెట్ లోకి వచ్చే అవకాశాలున్నట్లు వర్సిటీ ప్రతినిధులు చెబుతున్నారు.