: హత్యకేసులో ఇరుక్కున్న మాజీ రాష్ట్రపతి తమ్ముడు
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తమ్ముడు గజేంద్రసింగ్ పాటిల్ హత్యకేసులో ఇరుక్కున్నారు. 2005లో మహారాష్ట్రలో జరిగిన ప్రొఫెసర్ వీజీ పాటిల్ హత్యకేసులో గజేంద్రసింగ్ మీద కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించగా... వారిచ్చిన సమాచారం మేరకు మాజీ రాష్ట్రపతి తమ్ముడిని కూడా కేసులో చేర్చారు. రాజకీయ కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని భావిస్తున్నారు. అప్పట్లో జలగావ్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రొఫెసర్ వీజీ పాటిల్ కారుపై రాళ్లతో దాడి చేసి, అనంతరం ఆయనను కత్తులతో పొడిచి చంపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీకి జరిగిన ఎన్నికల్లో గజేంద్రపై ప్రొఫెసర్ గెలిచిన కొన్ని నెలల తర్వాత ఈ హత్య జరిగింది. 2007లో ఈ కేసును బాంబే హైకోర్టు సీబీఐకి అప్పగించింది. అయితే, రాష్ట్రపతి తమ్ముడు కావడం వల్లే గజేంద్ర సింగ్ ను సీబీఐ వెనకేసుకొస్తోందని అప్పట్లో ప్రొఫెసర్ భార్య రజని ఆరోపించారు.