: గోవాలో 20 కేజీల బంగారం పట్టివేత
విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో కిలోల లెక్కన బంగారం దేశంలోకి తరలివస్తోంది. ఇటీవల శంషాబాద్ ఎయిర్ పోర్టు లో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడుతున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా సోమవారం గోవా ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులకు ఇద్దరి వద్ద 20 కేజీల బంగారం కనిపించింది. వారిద్దరినీ విచారించిన కస్టమ్స్ అధికారులు అక్రమ మార్గాల్లోనే బంగారాన్ని తీసుకువస్తున్నారని నిర్ధారించుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పట్టుబడిన బంగారం విలువ రూ.5.5 కోట్లు ఉంటుందని అంచనా. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా విదేశాలకు చెందిన విమానాల్లోనే బంగారం దేశానికి వచ్చేది. అయితే సోమవారం గల్ఫ్ నుంచి గోవా వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ఈ బంగారాన్ని నిందితులు తీసుకువచ్చారు. దీనిపై సాక్షాత్తు కస్టమ్స్ అధికారులే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.