: కొత్త సంగీతం వింటే ఆశపడడం పెరుగుతుంది
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి: అని సామెత. సంగీతాన్ని శిశువులూ, పశువులే కాకుండా సర్పాలు కూడా ఎంతగా ఆస్వాదిస్తాయో చెబుతుంది ఈ ఆర్యోక్తి. అదే విషయాన్ని తాజాగా మాంట్రియెల్ న్యూరలాజికల్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు కూడా తమ తాజా అధ్యయనం ద్వారా నిరూపిస్తున్నారు. గతంలో వినని, కొత్త సంగీతాన్ని మనుషులకు వినిపించడం ద్వారా.. వారి మెదడులో జరిగే మార్పులను పరిశీలించారు. వ్యక్తుల్లో ఈ సంగీతంతో కొత్త ఆశలు, గుర్తింపు వంటివి వస్తున్నట్లు తెలుసుకున్నారు. మెదడులోని న్యూక్లియస్ అకంబెన్స్ అనే ప్రాంతంలో సంగీతం సమయంలో నిరంతర మార్పులు చోటుచేసుకున్నాయని గుర్తించారు. గుర్తింపు కోరుకోవడం, ఆశపడడం వంటి వాటిని ఈ న్యూక్లియస్ అకంబెన్స్ నియంత్రిస్తుంది. సంగీతం చూపే ప్రభావానికి ఇది కొత్త తార్కాణం అని పరిశోధకులు పేర్కొంటున్నారు.