: హుక్కా మత్తులో జోగుతున్న అమెరికా విద్యార్థిలోకం
ఆసియా దేశాలకే పరిమితమైందనుకుంటున్న హుక్కా సంస్కృతి ఇప్పుడు అమెరికాలోనూ వేళ్ళూనుకుంటోంది. అక్కడి యువతలో అత్యధికులు హుక్కా పీల్చడానికి అలవాటు పడిపోయారని ఓ అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా విద్యార్థుల్లో హుక్కాతోపాటు, పొగాకు చుట్టలు, గుట్కాల వాడకం ఎక్కువైపోయిందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పేర్కొంది. హైస్కూల్ సీనియర్ విద్యార్థుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు హుక్కా పీల్చుతున్నారని సీడీసీ తెలిపింది.
2010-2012 మధ్యకాలంలో 5,540 మంది విద్యార్థుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా హుక్కా వాడకంపై ఓ అంచనాకు వచ్చారు. మొత్తం 48 రాష్ట్రాల్లో 130 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. సామాజికంగా, ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ వ్యసనాల బారినపడుతున్నారని సీడీసీ అధ్యయనంలో వెల్లడైంది.