: గ్యాస్ పైప్ లైన్ తనిఖీలు... లీకవుతోందని భయపడ్డ ప్రజలు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో పైప్ లైన్ నుంచి గ్యాస్ లీకవుతోంది. దీంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. సమాచారం అందుకున్న గెయిల్ అధికారులు సర్పవరం రైల్వే స్టేషన్ వద్ద గ్యాస్ పైప్ లైన్ ను తనిఖీ చేస్తున్నారు. ఈ గ్యాస్ లీకేజీ సమాచారం అందుకున్న వెంటనే తహశీల్దార్ సింహాద్రి, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ పైప్ లైన్ తనిఖీల్లో భాగంగా గ్యాస్ బయటకు వదులుతున్నామని, దీని వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని గెయిల్ అధికారులు చెప్పారు. ఇటీవల నగరంలో గ్యాస్ పైప్ లైన్ పేలుడు ప్రమాదం జరిగిన నేపథ్యంలో జిల్లాలోని పైప్ లైన్లను పరిశీలిస్తున్నామని వారు తెలిపారు. అయితే, ముందస్తుగా దీనిపై ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు.