: ఉద్యోగం మానేసి కూలి పని చేసుకుంటా: ఎస్పీ ఆవేదన
ఎస్పీని కాబట్టే అడిషనల్ డీజీ భూపతిబాబు వేధిస్తున్నారని విజయవాడ రైల్వే ఎస్పీ డాక్టర్ సీహెచ్.శ్యామ్ ప్రసాద్ ఆరోపించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, అవసరమైతే ఉద్యోగం మానేసి కూలిపని చేసుకుంటా కానీ ఆత్మాభిమానం చంపుకోనని స్పష్టం చేశారు. తన అభిప్రాయాలను భూపతిబాబు ఎప్పుడూ వ్యతిరేకిస్తారని ఆయన తెలిపారు. తన భవిష్యత్ ట్రైబ్యునల్ ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.
అకారణంగా తనను బదిలీ చేస్తున్నారని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) కు శ్యామ్ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన వద్ద గత 20 ఏళ్లుగా పని చేస్తున్న సఫాయివాలా (క్లీనింగ్), ధోబీని నిలిపేశారు. గతంలో ఎస్పీకి మూడు షిఫ్టుల్లో డ్రైవర్లు అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు ఇద్దర్ని బదిలీ చేసి ఒక్క డ్రైవర్నే ఉంచారు. ఎస్పీ కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మోటారు వెహికల్ ను విజయవాడ సీఐకి కేటాయించారు. ఐపీఎస్ స్థాయి అధికారిని వేధించడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.