: అనవసర వివాదాలు లేపి...అధికారం కేంద్రానికి ఇవ్వొద్దు: దేవినేని ఉమ
కోతి కోతి తన్నుకుని రొట్టెను పిల్లికిచ్చినట్టు అనవసర వివాదాలు రేపి జాతీయ జల సంఘం చేతికి అధికారం ఇవ్వవద్దని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జల సమస్యను రాష్ట్రాల స్థాయిలోనే పరిష్కరించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అలా కాకుండా జాతీయ జలసంఘం చేతికి ఇస్తే భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయని ఆయన స్పష్టం చేశారు.
కృష్ణా బేసిన్ లో 10 లక్షల ఎకరాలకు పైబడి వరి నాట్లు పడాల్సి ఉండగా, కేవలం 150 హెక్టార్లలోనే నాట్లు పడ్డాయంటే... అది కూడా బోర్ల కిందే సాగు కావడం అంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. వర్షాలు పడకపోతే తాగునీటికి ప్రత్యామ్నాయం ఏమిటనే విషయంలో తర్జనభర్జనలు పడుతున్నామని ఆయన వెల్లడించారు.