: దావూద్ కోసం ఫేస్ బుక్ ద్వారా వేట
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ కోసం భారత నిఘా వర్గాలు ఫేస్ బుక్ వేదికగా వేట ప్రారంభించాయి. దావూద్ సోదరి హసీనా ముంబయిలో కన్నుమూసిన నేపథ్యంలో ఫేస్ బుక్ లో ఈ మాఫియా డాన్ కుటుంబీకుల కార్యకలాపాలపై నిఘా సంస్థలు కన్నేశాయి. ముఖ్యంగా దావూద్ కుమార్తె మహ్రూఖ్ పై ప్రత్యేక దృష్టి సారించాయి. అల్లుడు జునైద్ మియాందాద్ (పాక్ క్రికెటర్ మియాందాద్ కుమారుడు)తో పాటు పలువురు కుటుంబ సభ్యుల ఫేస్ బుక్ ఖాతాలను ఇంటలిజెన్స్ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
2010లో మహ్రూఖ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఓ కామెంట్ ద్వారా నిఘా వర్గాలు ఓ క్లూను పట్టుకోగలిగాయి. లాహోర్ లో భర్తతో కలిసి ఉండే మహ్రూఖ్... కరాచీలో ఉంటున్న అమ్మా, నాన్నా అందరినీ మిస్సవుతున్నానని ఆ పోస్ట్ లో పేర్కొంది. దీంతో, దావూద్ కరాచీలోనే ఉంటున్నాడని భారత నిఘా సంస్థలు నిర్ధారించుకున్నాయి. 2010 వరకు దావూద్ కుటుంబ సభ్యలు అందరూ ఫేస్ బుక్ లో క్రియాశీలకంగా ఉండేవారని, అయితే, ఆ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో ప్రైవసీ నిబంధనలు మారడంతో వారందరూ గప్ చుప్ అయిపోయారని, ప్రొఫైల్స్ తీసేశారని అధికారులు తెలిపారు.