: పక్షులతో చేపలు పట్టడమే ఇక్కడి స్పెషాలిటీ...!


పక్షులతో చేపలు పట్టడమేంటి? అదెలా సాధ్యం? అని ఆశ్చర్యపోతున్నారా? సాధ్యమే. జపాన్ లో అతి పురాతనమైన ఈ పద్ధతి ఇప్పటికీ అమల్లో ఉండడం విశేషం. గత 1300 ఏళ్లుగా ఈ పద్ధతి అమల్లో ఉండడం వింతే మరి. కార్మోరాంట్ లనే సముద్ర పక్షులు చేపలు పట్టడంలో ఆరితేరినవి. వీటిని పట్టుకుని కొద్దిపాటి శిక్షణ ఇస్తారు జపాన్ లోని జిఫూ సిటీ మత్స్యకారులు. శిక్షణలో ఉత్తీర్ణత సాధించిన కార్మోరాంట్ ల మెడకు ఉచ్చులాంటి తాడు కట్టి నది, సరస్సుల్లోకి వదులుతారు.
అంతే, కనిపించిన చేపను కనిపించినట్టు కార్మోరాంట్ లు హాంఫట్ చేసేస్తాయి. చిన్న సైజు చేపల్ని మింగేస్తాయి. అదే ఓ మోస్తరు సైజు చేపలైతే మాత్రం ఉచ్చు బిగించడం వల్ల మింగలేవు. అలా ఆరు చేపల్ని ఒకేసారి గొంతులో దాచుకోగలవు ఈ కార్మోరాంట్ లు. వాటి గొంతు నిండిపోగానే అవి యజమాని ఉన్న పడవ వద్దకు చేరుకుంటాయి. వెంటనే మత్స్యకారుడు ఆ చేపల్ని తీసి పక్షుల్ని మళ్లీ నీటిలోకి వదులుతాడు. ఇలా చేపలు పట్టడాన్ని 'ఉకాయ్' అంటారు.
ఈ పద్దతి వల్ల పెద్దగా లాభాలు రాకపోయినప్పటికీ పురాతన సంప్రదాయాన్ని కాపాడేందుకు 'ఉకాయ్' ను జపాన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ చేపల వేట చూసేందుకు పెద్దఎత్తున పర్యాటకులు జీఫు సిటీకి రావడం విశేషం.

  • Loading...

More Telugu News