: అన్నీ పోగొట్టుకున్న అభిమానికి పిలిచి ఉద్యోగమిచ్చిన ధోనీ
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ అభిమానిపై వాత్సల్యం ప్రదర్శించాడు. పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చాడు. వివరాల్లోకెళితే... ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ కు చెందిన రాజేంద్ర కుమార్ సైనీ (28)కి ధోనీ అంటే పిచ్చి. ఎంతలా అంటే, ప్రతి ఏడాది ధోనీ జన్మదినం నాడు గ్రాండ్ గా పార్టీలిస్తాడు. స్వీట్లు పంచడం, కానుకలివ్వడం గట్రా అన్నమాట. 2009లో అయితే, ఏకంగా రూ.50 వేలు ఖర్చుపెట్టాడు ధోనీ బర్త్ డే కోసం. తాను కూడబెట్టిన రూ.20 వేలకు తోడు భూమిని తాకట్టు పెట్టి మరో రూ.30 వేలు కలిపి 250 మంది అతిథులను ఆహ్వానించి ఆడంబరంగా వేడుకలు నిర్వహించాడు సైనీ.
ఈ ఖర్చులు చూసిన అతని కుటుంబం సైనీని పట్టించుకోవడం మానేసింది. ప్రేయసి ముఖం చాటేసింది. తనకున్న ఆడియో సీడీల షాపునూ అమ్మేశాడు. చివరికి 2010లో ధోనీ స్వస్థలం రాంచీకి వచ్చేశాడు. అక్కడే రోడ్డు పక్కన హోటళ్ళలో పనిచేస్తూ పొట్టపోసుకోసాగాడు. అయినా, ప్రతి సంవత్సరం తన అభిమాన క్రికెటర్ బర్త్ డే వేడుకలు నిర్వహించడం మాత్రం మానలేదీ వీరాభిమాని. చివరికి అతడి అభిమానాన్ని గుర్తించిన ధోనీ తన 32వ జన్మదినం సందర్భంగా అతడికి ఉద్యోగమివ్వాలని నిర్ణయించాడు.
శనివారం నాడు సైనీకి ఫోన్ చేసి రాంచీలోని తన ఫాంహౌస్ లో పనిలో చేరాలని చెప్పాడు. దీంతో, సైనీ ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. తన అభిమాన క్రికెటర్ కోసం జీతం తీసుకోకుండా పనిచేయడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు సైనీ. అన్నట్టు, ధోనీ బర్త్ డే నేడే!