: నేపాల్, బురిండీ లాంటి దేశాలు మనకన్నా మెరుగ్గా ఉన్నాయి... ఇదీ మన భారతం!
2015 నాటికి ప్రపంచంలోని అన్ని దేశాల్లోని పిల్లలు బడిలో ఉండాలన్న యునెస్కో లక్ష్యం నెరవేరే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదని ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ గ్లోబల్ మానిటరింగ్ నివేదిక వెల్లడించింది. సాంకేతిక రంగంలో ఎంతో ముందున్న భారత్ లో నేటికీ 14 లక్షల మంది చిన్నారులు ఇంకా బడి బయటే ఉన్నారు. వీరంతా 6-11 ఏళ్ల మధ్య వయసు పిల్లలు కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఇంకా బడి మెట్లెక్కని పిల్లల సంఖ్య 5.78 కోట్లుగా ఆ నివేదిక తేల్చింది. నివేదిక గణాంకాల ప్రకారం, బడి బయట ఎక్కువ మంది పిల్లలున్న తొలి ఐదు దేశాల జాబితాలో భారత్ కూడా ఉండిపోవాల్సివచ్చింది. పొరుగునే ఉన్న నేపాల్ మాత్రం ఈ విషయంలో భారత్ కంటే మెరుగైన రీతిలో చర్యలు చేపట్టి, 99 శాతం మంది పిల్లలను బడిలో వేసేసింది. ఇక ఆ దేశంలో కేవలం 1 శాతం మంది పిల్లలు మాత్రమే బయట ఉన్నారు.
బురుండి లాంటి చిన్న దేశం కూడా 94 శాతం మంది పిల్లలను బడిలో చేరేలా చర్యలు చేపట్టింది. 2005లో కేవలం 54 శాతం ఎన్ రోల్ మెంట్ ఉన్న ఆ దేశం స్కూల్ ఫీజులను ఎత్తివేయడం ద్వారా ఈ తరహా అద్భుత ఫలితాలను సాధించగలిగింది. భారత్ దాయాది పాకిస్థాన్ లోనూ 10 లక్షల మంది పిల్లలకు పైగా బడి బయటే ఉన్నారట. ఆయా దేశాల ప్రభుత్వాల నిష్ర్కియాపరత్వం కారణంగానే చిన్నారులు బడి ముఖం కూడా చూడలేకపోతున్నారని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరినా బొకోవా ఆరోపించారు.