: అంత్యక్రియలు చేస్తుండగా... బతికొచ్చాడు!
చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిన ఘటనలో ఒడిశాకు చెందిన ప్రకాశ్ అనే కూలీ చనిపోయినట్టు గుర్తించిన అధికారులు, ఆ మృతదేహాన్ని అతడి స్వస్థలానికి పంపారు. జీవనోపాథికి వెళ్తే...విగతజీవిగా మారాడని విషణ్ణవదనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అతడి కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఇంతలో ఓ ఫోన్ వచ్చింది. అంతే, ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దానికి కారణం అంత్యక్రియలు చేయాలనుకుంటున్న శవం ప్రకాష్ ది కాదట!
చెన్నైలో బహుళ అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో 61 మంది మరణించారు. భవనం కూలి మూడు రోజులు ముగిశాయి. ఇక ఎవరూ బతికే అవకాశం లేదని, మృతదేహాలను స్వస్థలాలకు పంపేందుకు అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. ఇంతలో శిథిలాల కింద ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ప్రకాశ్ ను అధికారులు గుర్తించి రక్షించారు. వెంటనే అతను బతికే ఉన్నానంటూ కుటుంబ సభ్యులకు పోన్ చేసి క్షేమసమాచారం అందించాడు. అంతే, అతని కుటుంబ సభ్యులు ఆదనందంలో ఉబ్బితబ్బిబ్బయ్యారు. చితిపై ఉన్న శవం ఎవరిదన్నది గుర్తించేందుకు అధికారులు దానిని తిరిగి చెన్నైకి తరలించనున్నారు.