: తక్షణమే ప్రభుత్వ ఏర్పాటు జరగాలి... లేకపోతే కష్టమే: ఇరాక్ కు పెద్దన్న సూచన
ఇరాక్, సిరియా దేశాల్లోని మెజారిటీ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులతో ఆ దేశాల భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉందని అమెరికా హెచ్చరించింది. సాధ్యమైనంత త్వరగా ఇరాక్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని... అప్పుడే ఈ ముప్పు సమసిపోయే అవకాశముందని, ఆ దిశగా ఇరాక్ రాజకీయ నేతలు యత్నించాలని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సూచించింది. తాము ఊహించినంత వేగంగా చర్యలు తీసుకోని పక్షంలో ఇరాక్ భధ్రత పెను సమస్యలో చిక్కుకునే ప్రమాదం లేకపోలేదని గురువారం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ చెప్పారు. ఇరాక్ భధ్రత విషయంలో ఆ దేశ రాజకీయ నేతలు తక్షణమే ఏకం కావాల్సిన అవసరముందని చెప్పారు. అంతేకాక ఇరాక్ బలగాలను మరింత బలోపేతం చేయాలన్నారు. సైనిక చర్య కన్నా దౌత్య, రాజకీయ పరిష్కారంతోనే ఈ సమస్యకు చెక్ పెట్టగలమని ఆయన పేర్కొన్నారు.