: సహారా ఆస్తుల్ని అమ్ముకుంటాం అనుమతివ్వండి: సుప్రీంకు ఐటీ శాఖ విన్నపం
మూలిగే నక్కపై తాటికాయ పడటమంటే ఇదేనేమో! ఇప్పటికే నాలుగు నెలలుగా జైలులో ఉన్న సుబ్రతో రాయ్ బెయిల్ కోసం రూ. 10 వేల కోట్ల మేర నిధుల సేకరణలో కొట్టుమిట్టాడుతున్న సహరా గ్రూపుపై తాజాగా ఆదాయ పన్ను శాఖ కేసు పంజా విసిరింది. 2011 నుంచి తమకు సహారా సంస్థ చెల్లించాల్సిన పన్ను బకాయిలు రాబట్టేందుకు ఆదాయ పన్ను శాఖ భారత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బకాయిలను రాబట్టుకునేందుకు సంస్థకు చెందిన ఆస్తులను విక్రయించుకునేందుకు తమకు అవకాశం కల్పించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించింది. అయితే, బెయిల్ పొందేందుకు అవసరమయ్యే నిధుల కోసం విదేశాల్లోని తమ హోటళ్లను విక్రయించేందుకు అనుమతించాలన్న సహారా ప్రతిపాదనకే సుప్రీం కోర్టు అనుమతివ్వలేదు. స్వదేశంలోనే ఉన్న ఆస్తులను విక్రయించుకోవచ్చు కదా అన్న సుప్రీంకోర్టు సూచనకు, అంత విలువైన ఆస్తులు తమ వద్ద లేవని కంపెనీ తెలిపింది. విదేశాల్లో జరిగే క్రయవిక్రయాలు సవ్యంగా జరుగుతాయన్న నమ్మకం ఏమిటని ఈ సందర్భంగా సుప్రీం ప్రశ్నించింది. డిపాజిట్ దారులకు రూ. 38 వేల కోట్లను తిరిగి చెల్లించాల్సిన కేసులో సుబ్రతో రాయ్ నాలుగు నెలలుగా జైలులో ఉన్న విషయం తెలిసిందే.