: వారి క్షేమమే మా లక్ష్యం... చర్చలు జరుపుతున్నాం: విదేశాంగ శాఖ
ఇరాక్ లోని తిక్రిత్ పట్టణంలో ఓ ఆసుపత్రి నుంచి అపహరణకు గురైన 40 మంది నర్సుల క్షేమమే తమ లక్ష్యమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వారి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని, అయితే వారు ఎక్కడున్నదీ తెలియదని విదేశాంగ శాఖ తెలిపింది. వారిని సురక్షితంగా భారత దేశం తీసుకొచ్చేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలను విదేశాంగ శాఖ చేస్తోందని వెల్లడించింది.
ఇదిలా ఉంచితే, మరోపక్క కేరళ ముఖ్యమంత్రి ఉమన్ చాందీ మాట్లాడుతూ, ఇరాక్‌లోని తిక్రిత్ పట్టణంలోని ఓ ఆసుపత్రి నుంచి అపహరణకు గురై మిలిటెంట్ల చెరలో ఉన్న 46 మంది భారతీయ నర్సులు త్వరలో క్షేమంగా స్వదేశానికి రానున్నారని అన్నారు. మిలిటెంట్ల చెరలో చిక్కుకున్న ఆ నర్సులంతా ఎర్బిల్ ఎయిర్ పోర్ట్ లో క్షేమంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.
వారిని భారత్ కు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చాందీ స్పష్టం చేశారు. కాగా, కేరళకు చెందిన 40 మంది నర్సులను తిరుగుబాటుదారులు బాంబులు పేల్చి, భయభ్రాంతులకు గురిచేసి, అపహరించి బలవంతంగా మరో ప్రాంతానికి తరలించిన సంగతి తెలిసిందే.