: గంభీర్, కోహ్లీలకు వార్నింగ్
ఇద్దరూ ఢిల్లీ ఆటగాళ్ళే. ఒకరు సీనియర్, మరొకరు జూనియర్. అయితేనేం ఆటలో ఒకరికి ఒకరు తీసిపోరు. వాళ్ళిద్దరిలో ఒకరు ఫామ్ లేమితో ఉద్వాసనకు గురయితే.. మరొకరు టీమిండియాలో వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న డైనమిక్ బ్యాట్స్ మన్. కానీ, ఆటలోనే కాదు మాటల యుద్ధంలోనూ తామిద్దరం ఒకరికి ఒకరం తీసిపోమని చాటారీ క్రికెటర్లు.
గురువారం బెంగళూరులో జరిగిన కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ లో ఇరు జట్లకు సారథ్యం వహిస్తున్న గంభీర్, కోహ్లీలు తమ నోటికి పనిచెప్పారు. ఇన్నింగ్స్ పదో ఓవర్ లో కోహ్లీ అవుటై పెవిలియన్ కు మరలుతున్న సమయంలో, గంభీర్ తన జట్టు సహచరులతో సంబరాలకు దిగాడు. అయితే, కోహ్లీ మైదానం వీడకుండా గంభీర్ వద్దకు వెళ్ళి నో్టికి పనిచెప్పాడు. దీంతో గంభీర్ కూడా ఆగ్రహంతో కోహ్లీ వైపు దూసుకెళ్ళాడు. ఢిల్లీ ఆటగాడు రజత్ భాటియా.. గంభీర్ ను చల్లబరిచే ప్రయత్నం చేయడంతో వాగ్వాదం సద్దుమణిగింది. ఈ సంఘటనను లెవల్ 1 నేరంగా పరిగణించి వారిద్దరినీ ఐపీఎల్ మ్యాచ్ రిఫరీ మందలించి వదిలేశారు.