: శవపేటికలు పంపండి... తిరిగొస్తాం!: ఇరాక్ లో నర్సుల ఆక్రందన
ఇరాక్ లో మిలిటెంట్ల చెరలో ఉన్న భారత నర్సులు తమ పరిస్థితి పట్ల తీవ్రంగా స్పందించారు. భారత ప్రభుత్వం ఇప్పటికే ఎంతో సమయం వృథా చేసిందని, శవపేటికలు పంపితే శవాలుగానైనా తిరిగొస్తామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నెల క్రితం తిక్రిత్ పట్టణంలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు 46 మంది భారత నర్సులను బందీలుగా పట్టుకున్నారు. ప్రస్తుతం వారిని మరో ప్రదేశానికి తరలిస్తుండడంతో నర్సుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో సోనా జోసెఫ్ అనే నర్సు ఫోన్ ద్వారా భారత మీడియాతో మాట్లాడారు. తరలింపు ప్రక్రియను తాము సున్నితంగానే వ్యతిరేకిస్తున్నా, ప్రస్తుతం తీవ్రవాదుల స్వరంలో మార్పు వచ్చిందని తెలిపారు. వారు కటువుగా వ్యవహరిస్తుండడంతో తాము వారి ఆజ్ఞలను పాటించక తప్పడంలేదని నిస్సహాయత వ్యక్తం చేశారు.