: కేసీఆర్ మరో జలయజ్ఞం చేస్తారట...ఎవర్ని ఉద్ధరించడానికి?: దేవినేని
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో జలయజ్ఞం చేస్తారట...ఎవర్ని ఉద్ధరించడానికి? అని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, గతంలో రాజశేఖర్ రెడ్డి జల యజ్ఞం చేపట్టాడు, రాష్ట్ర ప్రజలను ఉద్ధరించాడు, ఇప్పడు కేసీఆర్ మరో జల యజ్ఞం చేపడతాడంట ఎలా? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయం నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా వెళ్లి చెప్పాలని ఆయన సవాలు విసిరారు. నల్గొండ, ఖమ్మం జిల్లా ప్రజల నీటి అవసరాలు తీర్చకుండా, మోటార్లు పెట్టి తెలంగాణకు నీరు తోడేస్తాం, కాల్వలు తవ్వేస్తాం అని కేసీఆర్ ప్రజలను రెచ్చగొడుతున్నాడని ఆయన మండిపడ్డారు. డెల్టాకు తాగు నీరు విడుదల చేస్తే...అబద్ధాలు చెప్పి రాద్ధాంతం చేస్తున్న తెలంగాణ నేతలు, రాష్ట్రం విడిపోయిన తరువాతైనా నిజాలు మాట్లాడాలని ఆయన సూచించారు. తరువాత చేతకాలేదని ప్రజలు అనకుండా ఉండడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ప్రజలను తిట్టవద్దని ఆయన సూచించారు. నీటి విడుదలపై ఏవైనా సందేహాలు ఉంటే జలసంఘాలను ప్రశ్నించాలని ఆయన సూచించారు. అంతే కానీ అవాకులు చవాకులు పేలి ప్రజల్లో చులకన కావొద్దని ఆయన హితవు పలికారు.