: మంచి తరుణం మించిపోవును..!


ఇంగ్లండ్ జట్టు మెడలు వంచేందుకు ఇదే సరైన తరుణమంటున్నాడు టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ. మూడేళ్ళ కిందట ఇదే గడ్డపై ఎదురైన 4-0 వైట్ వాష్ కు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపాడు. తాజాగా, ఇంగ్లండ్ తో టీమిండియా ఆడనున్న ఐదు టెస్టుల సిరీస్ కు గంగూలీ కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇంగ్లండ్ జట్టు 2011నాటి ఫామ్ ను కనబర్చడంలో విఫలమవుతోందని, కెవిన్ పీటర్సన్, గ్రేమ్ స్వాన్, ఆండ్రూ స్ట్రాస్, జోనాథన్ ట్రాట్ వంటి కీలక ఆటగాళ్ళు ఇప్పుడు జట్టులో లేరని పేర్కొన్నాడు. స్వాన్ రిటైర్మెంట్ తర్వాత ఆ స్థాయి నాణ్యత ఉన్న స్పిన్నర్ ఇంగ్లండ్ కు లభించలేదని దాదా తెలిపాడు. కెప్టెన్ గా ఆలిస్టర్ కుక్ కు ఇదో ప్రతికూలాంశం అవుతుందని భావిస్తున్నట్టు వివరించాడు. సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ వంటి ఆటగాళ్ళు కూడా భారత్ కు లేరు కదా? అన్న ప్రశ్నకు బదులిస్తూ... రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా, శిఖర్ ధావన్ వంటి ఆటగాళ్ళ అండ భారత్ కు ఉందని తెలిపాడు. అయితే, అనుభవలేమి కాసింత ప్రభావం చూపొచ్చని హెచ్చరించాడీ ప్రిన్స్ ఆఫ్ కోల్ కతా.

  • Loading...

More Telugu News