: అసెంబ్లీలో మీ గుడ్డలూడదీస్తా... పోలీసులపై ఎమ్మెల్యే దాష్టీకం
ప్రజాప్రతినిధుల్లో కొందరు పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం తెలిసిందే. ఈ ఎమ్మెల్యే కూడా ఆ కోవలోకే వస్తాడు. లేట్ నైట్ పార్టీ నిబంధనలకు వ్యతిరేకమని చెప్పినందుకు పోలీసులనే గుడ్డలూడదీస్తానని బెదిరించాడీ ప్రజాప్రతినిధి. కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయానంద్ కాశప్పణవార్ (42) తన జన్మదినం సందర్భంగా బెంగళూరులోని స్కై లాంజ్ బార్లో పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి రాజకీయప్రముఖులతో పాటు రౌడీ షీట్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా హాజరయ్యాడు.
మద్యం తాగుతూ, డ్యాన్సులు చేస్తూ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, రాత్రి ఒంటిగంట వేళ పోలీసులకు ఈ పార్టీ విషయమై ఫిర్యాదు అందింది. ఇద్దరు కానిస్టేబుళ్ళు కెమెరా తీసుకుని స్పాట్ కు చేరుకున్నారు. 11 తర్వాత మద్యం నిషేధం అని ఎమ్మెల్యేకి చెప్పి, పార్టీ జరిగినట్టు ఆధారాలను కెమెరాలో బంధించే ప్రయత్నం చేయబోయారు. దీంతో, ఆగ్రహించిన ఎమ్మెల్యే "నేనెవరో తెలుసా..?" అంటూ సర్రున లేచాడు.
వారి వెంటపడి కెమెరా ధ్వంసం చేయడమే కాకుండా అడ్డుకోబోయిన ఓ కానిస్టేబుల్ ను కొట్టాడు. అంతటితో ఆగకుండా "అసెంబ్లీలో మీ గుడ్డలూడదీస్తా!" అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో, వారు పై అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేయగా, ఎమ్మెల్యే దాష్టీకం పట్ల కోర్టులో ఆధారాలు సమర్పిస్తామని తెలిపారు.