: ఫిక్సింగ్ కోసం అమ్మాయిని బహుమతిగా ఇచ్చారు: లూ విన్సెంట్
అమ్మాయిని ఆశచూపి తనను ఫిక్సింగ్ రొంపిలో దింపారని తీరిగ్గా వాపోతున్నాడు న్యూజిలాండ్ క్రికెటర్ లూ విన్సెంట్. ఇటీవలే విన్సెంట్ పై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు జీవితకాల నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో తన నేరాన్ని అంగీకరిస్తూ విన్సెంట్ మీడియాకు ప్రకటన విడుదుల చేశాడు. అందులో తాను ఫిక్సింగ్ ఉచ్చులో ఎలా చిక్కుకున్నది వివరించాడు.
2008లో భారత్ లో నిర్వహించిన ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) సందర్భంగా ఫోన్ వస్తే ఓ హోటల్ కు వెళ్ళానని తెలిపాడు. క్రికెట్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించాలన్నది ఆ ఫోన్ కాల్ సారాంశమని, అయితే, ఏజెంటు చెప్పిన చోటికి వెళితే అందమైన అమ్మాయి ఉందని తెలిపాడు. అక్కడ ఓ వ్యక్తి తనకు భారీగా డబ్బులిచ్చి లైఫ్ టైమ్ స్పాన్సర్ షిప్ కు ఇది డౌన్ పేమెంట్ మాత్రమే అని, ఇక ఈ అమ్మాయిని బహుమతిగా ఇస్తున్నట్టు చెప్పాడని విన్సెంట్ పేర్కొన్నాడు.
అయితే, ఈ విషయాన్ని హోటల్ బయటే ఉన్న తన ఏజెంటుకు, అటు తర్వాత తన ఫేవరెట్ క్రికెటర్ కు చెప్పానని వారు కూడా ప్రోత్సహించారని వెల్లడించాడు. తాను సైతం ఫిక్సింగ్ చేసి డబ్బులు సంపాదించానని తన ఫేవరెట్ క్రికెటర్ చెప్పడంతో మరేమీ ఆలోచించలేదని విన్సెంట్ చెప్పుకొచ్చాడు. ఇక, తొలి మ్యాచ్ లో ఫిక్సింగ్ తీరుతెన్నులు తెలియక పొరపాట్లు చేసి బుకీలతో నానామాటలు అనిపించుకున్నానని వివరించాడు. త్వరగా అవుటై పెవిలియన్ కు రాగానే తన ఫేవరెట్ క్రికెటర్ కస్సుమని లేచాడని తెలిపాడు. ఆ విధంగా తాను ఫిక్సర్ గా తయారయ్యానని వెల్లడించాడీ కివీస్ బ్యాట్స్ మన్.
ఒకప్పటి తన ఆరాధ్య క్రికెటర్ ఇప్పుడు తనకేమీ కాడని, న్యాయ సమస్యల కారణంగా అతనిపేరు చెప్పలేనని విన్సెంట్ పేర్కొన్నాడు. కాగా, అప్పట్లో కివీస్ ఆల్ రౌండర్ క్రిస్ కెయిర్న్స్ పేరు కూడా ఫిక్సింగ్ అంశంలో పలుమార్లు తెరపైకి వచ్చింది.