: విజయవాడ కోర్టు సంచలన తీర్పు... కమిషనర్ కు కోర్టు నిర్బంధం
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు స్థానిక రెండవ జూనియర్ సివిల్ కోర్టు నెల రోజుల కోర్టు నిర్బంధ శిక్షను విధించింది. వివరాల్లోకి వెళితే... 1985లో సమ్మెట జగన్మోహనరావు విజయవాడలోని కబేళ ప్రాంతంలో 125 గజాల స్థలాన్ని కొన్నారు. ఈ స్థలంలో రోడ్డు నిర్మాణం కోసం కార్పొరేషన్ అధికారులు ప్రయత్నించగా... జగన్మోహన్ రావు కోర్టుకెళ్లారు. ఈ నేపథ్యంలో, ఆ స్థలం జోలికి వెళ్లమని మున్సిపల్ అధికారులు చెప్పడంతో కేసును కోర్టు డిస్మిస్ చేసింది. తర్వాత ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్న మున్సిపల్ కార్పొరేషన్ అక్కడ సిమెంట్ రోడ్డు, మంచినీరు, డ్రైనేజ్ పైప్ లైన్లు వేసింది. దీంతో స్థల యజమాని మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కేసు హైకోర్టు వరకు వెళ్లగా... రెండు నెలల్లో ఆ స్థలంలోని ఆక్రమణలు తొలగించి... బాధితుడికి ఇవ్వాలని హైకోర్టు తీర్పునిచ్చింది. అయినా అధికారుల్లో చలనం కలగలేదు. దీంతో బాధితుడు అదనపు సివిల్ కోర్టులో ఈపీ వేశారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి సత్యనారాయణ నెల రోజుల పాటు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు కోర్టు నిర్బంధ శిక్షను విధించారు.