: ఇక్కడ కరెంట్ బిల్ కట్టాలంటే హెల్మెట్ తప్పనిసరి!
వెతికిచూడ వింతలు కోకొల్లలు! జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ నగరంలో అక్షదీప్ ప్లాజాలో విద్యుత్ శాఖ కార్యాలయం ఉంది. అక్కడికెళ్ళి లోపలికి తొంగిచూసిన వాళ్ళు ఆశ్చర్యపోకమానరు. ఉద్యోగులంతా హెల్మెట్లు ధరించి తమతమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. అంతేకాదండోయ్, కరెంటు బిల్లులు కట్టడానికో, లేక, మరే ఇతర పని మీదో కరెంటు ఆఫీసుకు వచ్చేవారినీ హెల్మెట్లు పెట్టుకుని రమ్మని ఆ ఉద్యోగులు చెబుతారు. ఇంతకీ కారణం ఏంటంటే... పాత భవనంలో ఆ ఆఫీసు ఏర్పాటు చేశారు. అది శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతుందో.. అన్నట్టుగా తయారైందట!
ఎవరూ గాయపడకుండా ఉండేందుకే ఈ హెల్మెట్ల ఆలోచన అని, సీలింగ్ పెచ్చులు రాలిపడుతుంటాయని, చెక్క దూలాలు కూడా విరిగిపోయిన స్థితిలో ఉన్నాయని అక్కడి ఉద్యోగులు తెలిపారు. సరిగ్గా ఫ్యాన్ కింద కూర్చునే సుదర్శన్ పాన్ అనే ఉద్యోగి మాట్లాడుతూ, తన వద్దకు బిల్ కట్టడానికి వచ్చేవారికి మాత్రం హెల్మెట్లు తప్పక ధరించాలని సూచిస్తానని చెప్పారు. విండో కౌంటర్ వద్ద మాత్రం ఆ అవసరం ఉండదని తెలిపారు. తమ ఆఫీసులోనే ఉండే ఎస్ డీవోకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించడంలేదని ఉద్యోగులు వాపోతున్నారు.