: వీళ్లను మగాళ్లే అనాలా?...


వీళ్లను మగాళ్లే అనాలా? అని సీఐఎస్ఎఫ్ మహిళా సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ మెట్రో రైల్లో మహిళా కంపార్ట్ మెంట్లు, మహిళా సీట్లలో కూర్చొనే మగాళ్లను ఉద్దేశించి వారీ వ్యాఖ్యలు చేస్తున్నారు. సాధారణంగా బస్సులు, రైళ్లలో మహిళలకు ప్రత్యేకంగా సీట్లు ఉంటాయి. వారి శారీరక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు అది. అయితే కొందరు మగ మహారాజులు మాత్రం ఆడవాళ్లకేనా, మాకు సీట్లు లేవా? అంటూ అతితెలివితో ప్రశ్నిస్తుంటారు.

మరి కొందరు వారి సీట్లలో కూర్చోని లేవను కూడా లేవరు. ఇలాంటి వారిపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు మెట్రో (సీఐఎస్ఎఫ్) సివిల్ దుస్తుల్లో వచ్చి కేసులు నమోదు చేస్తుంది. జనవరి నుంచి ఇప్పటివరకు అలా పట్టుబడిన వారి సంఖ్య 3,500 మంది. మహిళల బోగీ అని రాసి ఉన్నా ఎక్కడంపై వారు నిలదీస్తారు. కొంత మంది ఇదే తొలిసారి అని చెప్పగా, కొంత మంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి బోగీ ఎక్కామంటారు.

ఇంకొంతమంది సారీ చెప్పి స్టేషన్ రాగానే దిగిపోతారు. మరి కొంత మంది మాత్రం అయితే ఏం? అంటూ ఎదురు ప్రశ్నిస్తుంటారట. వీరిలో పెడసరంగా సమాధానం చెప్పే వారిపై కేసులు నమోదు చేసి పోలీసులకు అప్పగిస్తామని సీఐఎస్ఎఫ్ మహిళా సిబ్బంది తెలిపారు. ఇలాంటి వారి వల్లే అత్యాచారాలు జరిగే ఆస్కారముందని, వీరిని కోర్టులో ప్రవేశపెట్టిన తరువాత వారికి జరిమానా కానీ జైలు శిక్ష కానీ విధిస్తారని వారు వెల్లడించారు. దీనిపై మండిపడుతూ వారి స్థాయి, స్థితి తెలుసుకోలేని వారిని మగాళ్లు అనాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు సీఐఎస్ఎఫ్ మహిళా సిబ్బంది.

  • Loading...

More Telugu News