: నూతన రాజధాని... లొకేషన్ చేంజ్?
ఏపీకి కొత్త రాజధాని విషయం ఇంకా తేలకపోవడంతో పలు ప్రతిపాదనలు తెరమీదికి వస్తున్నాయి. తాజాగా, గుంటూరు జిల్లా అమరావతి కేంద్రంగా రాజధానిని అభివృద్ధి చేయాలని చంద్రబాబు సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా నదీతీర ప్రాంతమైతే భవిష్యత్ అవసరాల దృష్ట్యా మెరుగ్గా ఉంటుందన్నది వారి ఆలోచన! అమరావతి కేంద్రంగా అటు తాడికొండ, మంగళగిరి, ఇటు అచ్చంపేటలను కలుపుకుని రాజధాని నిర్మాణం చేపట్టాలన్నది ప్రభుత్వ ప్రణాళికగా కనిపిస్తోంది.
నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలను భారీ వంతెనల సాయంతో కలపాలని, తద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధిలో భాగం పంచుకుంటాయని బాబు తలపోస్తున్నట్టు సమాచారం. అంతేగాకుండా, ఏపీలో మరో ప్రధాన నగరం విజయవాడకు రాజధానికి మధ్య దూరం కూడా తగ్గుతుంది. తొలుత విజయవాడ, గుంటూరు మధ్య అనుకున్నా, అక్కడ భూముల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారుకు అమరావతి అన్ని విధాలా అనుకూలవతిలా కనిపిస్తోంది.