: పార్కుల్లో కెమెరాలు... లవర్స్ కు ఇక కష్టమే!
ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు ఉద్దేశించిన పార్కులు ప్రేమికుల ముద్దుముచ్చట్లకు వేదికగా మారడాన్ని బెంగళూరు మహానగర పాలక సంస్థ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో ప్రేమికులు హద్దులు దాటరాదంటూ హెచ్చరికలు జారీచేయడమే గాకుండా, బసవనగుడి పార్కులో కెమెరాలను ఏర్పాటు చేసింది. గీతదాటి ప్రవర్తించే ప్రేమపక్షులకు ఈ నిర్ణయం శరాఘాతమే.
ఎవరైనా పార్కులో ముద్దులకు, కౌగిలింతలకు ఉపక్రమిస్తే వెంటనే ఈ కెమెరాలు పట్టిచ్చేస్తాయి. దాంతో వారిని పార్కు నుంచి బయటికి పంపేస్తారట. ఈ పార్కు సమీపంలో కాలేజీలు అధికసంఖ్యలో ఉన్నాయి. దీంతో, విద్యార్థి ప్రేమికులకు బసవనగుడి పార్కు మాంచి అడ్డాగా మారిపోయింది. వారి ముద్దుమురిపాలు చూడలేకపోతున్నామని పలువురు సీనియర్ సిటిజన్లు చేసిన ఫిర్యాదులతో బెంగళూరు నగరపాలక సంస్థ ఈ స్థాయిలో స్పందించాల్సి వచ్చింది.