: ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులను ఇంటికి పంపిన కేంద్ర మంత్రి
కేంద్ర మంత్రివర్గంపై ప్రధాని మోడీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. విధులకు ఆలస్యంగా వచ్చారంటూ సమాచార, ప్రసార శాఖకు చెందిన 200 మంది ఉద్యోగులను మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఒక్కరోజు సాధారణ సెలవుపై ఇంటికి పంపారు. మంత్రి సోమవారం ఉదయం 9.15కి శాస్త్రి భవన్లోని సమాచార, ప్రసార శాఖ కార్యాలయానికి తనిఖీ నిమిత్తం వెళ్ళారు. అక్కడ ఆయనకు ఖాళీ కుర్చీలన్నీ వెక్కిరిస్తూ కనిపించాయి. దీంతో, ఆగ్రహించిన మంత్రి ఆలస్యంగా వచ్చిన వారందరికీ తనను కలవమని చెప్పాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం, విడతలవారీగా ఉద్యోగులు మంత్రిని కలిశారు. సమయపాలన విషయంలో కచ్చితంగా ఉండాలని వారికి కటువైన హెచ్చరికలు జారీ చేసిన ప్రకాశ్ జవదేకర్, ఒక్కరోజు సాధారణ సెలవుపై ఇంటికివెళ్ళండంటూ హుకుం జారీ చేశారు.