: ఆ చాన్సొస్తే వదలను: విద్యాబాలన్
బాలీవుడ్ లోని ప్రతిభావంతులైన నటీమణుల్లో విద్యాబాలన్ తొలి వరుసలో ఉంటుంది. అయితే, ఆమె ఇంతవరకు ఖాన్ త్రయంతో నటించకపోవడం విచిత్రమే. వారిపక్కన నటించే చాన్స్ దక్కకపోవడానికి కారణాలేవైనా గానీ, ఈ ముద్దుగుమ్మ మాత్రం ఆశావహ దృక్పథం కనబరుస్తోంది. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లతో నటించే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని స్పష్టం చేసింది. వారితో నటించాలంటే తనకు నప్పేలా స్క్రిప్టు ఉండడం కూడా ముఖ్యమని పేర్కొంది. ముంబయిలో పీటీఐతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పింది.
కెరీర్ ను ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదని, స్క్రిప్టును బట్టే పాత్రలు ఎంపిక చేసుకుంటున్నానని ఈ 'డర్టీ పిక్చర్' స్టార్ తెలిపింది. ప్రస్తుతం డిటెక్టివ్ థ్రిల్లర్ 'బాబీ జాసూస్' సినిమాలో నటించిన విద్యా ఆ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లతో బిజీబిజీగా ఉంది.