: ఐపీఎల్ లో 'గేల్' దుమారం
క్రిస్ గేల్.. ఆధునిక క్రికెట్లో బౌలర్ల పాలిట రాక్షసుడు.. బంతికి విలన్! నేడు మరోమారు తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఫరవాలేదు, మంచి స్కోరు సాధించామన్న కోల్ కతా నైట్ రైడర్స్ ఆనందాన్ని ఆవిరి చేసే క్రమంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం గేల్ సిక్సర్ల మోతతో హోరెత్తిపోయింది. నైట్ రైడర్స్ విసిరిన 155 పరుగుల లక్ష్యం కాస్తా గేల్ దూకుడు ముందు చిన్నబోయింది.
ఓపెనర్ గా బరిలో దిగిన ఈ కరీబియన్ స్టార్ కేవలం 50 బంతుల్లో 85 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ స్కోరులో 9 భారీ సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు గేల్ దుమారం ఎంతలా రైడర్స్ ను ఉక్కిరిబిక్కిరి చేసిందో. దీంతో, మరో 15 బంతులు మిగిలుండగానే రాయల్ చాలెంజర్స్ విజయభేరి మోగించింది. 17.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. చాలెంజర్స్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ కోహ్లీ 35 పరుగులు చేయగా, డివిలియర్స్ 22 రన్స్ తో నాటౌట్ గా మిగిలాడు.