: డే/నైట్ టెస్టుకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ రెడీ
ఎన్నాళ్ళనుంచో ప్రతిపాదన దశలోనే మూలుగుతున్న డే/నైట్ టెస్టుల నిర్వహణకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులు ముందుకొచ్చాయి. వచ్చే ఏడాది నవంబర్లో ఈ రెండు జట్లు ఫ్లడ్ లైట్ల వెలుగులో టెస్టు ఆడాలని నిర్ణయించాయి. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్ తెలిపారు. మెల్బోర్న్ లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశాల సందర్భంగా సదర్లాండ్ కివీస్ క్రికెట్ సీఈవో డేవిడ్ వైట్ తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఈ డే/నైట్ టెస్టు నిర్వహణకు మార్గం సుగమమైంది.
అయితే, వచ్చే ఏడాది మెల్బోర్న్ వేదికగా జరిగే బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీ వేదికగా జరిగే న్యూఇయర్స్ టెస్టు మాత్రం మామూలు పద్ధతిలోనే జరుగుతాయని సదర్లాండ్ స్పష్టం చేశారు. 2015 డిసెంబర్లో కివీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.