: భజ్జీకి పీలే సలహా!
భారత ఆఫ్ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ తన జీవితకాలంలోనే అపురూపమైన సలహా అందుకున్నాడు. ఆ సలహా అందించిన వ్యక్తి ప్రపంచ సాకర్ లెజెండ్ పీలే కావడం విశేషం. ఫిఫా వరల్డ్ కప్ వీక్షించేందుకు బ్రెజిల్ చేరుకున్న భజ్జీ విశ్వవిఖ్యాత ఫార్వర్డ్ పీలేను రియో డి జెనీరోలో కలుసుకున్నాడు. ఈ సందర్భంగా పీలే... 'పోరాడుతూనే ఉండు' అంటూ సర్దార్జీకి సలహా ఇచ్చారు.
స్టార్ కావడం సులువేనని, అయితే ఆ స్టార్ డమ్ నిలుపుకోవడంలోనే కష్టమంతా దాగి ఉందని పీలే అన్నారు. దాన్నో సవాల్ గా స్వీకరించాలని సూచించారు. భజ్జీ మాట్లాడుతూ, తాము క్రికెట్ మ్యాచ్ సన్నాహాల్లో భాగంగా ఫుట్ బాల్ ఆడతామని పీలేకు తెలిపాడు.
కాగా, బ్రెజిల్ కు 92 మ్యాచ్ లలో ప్రాతినిధ్యం వహించిన పీలే 77 గోల్స్ నమోదు చేశారు. పీలే అసలు పేరు ఎడ్సన్ అరాంటెస్ డో నసిమెంటో. ముద్దుపేరు పీలేతోనే ఆయన బాగా పాప్యులర్ అయ్యారు. పీలే హయంలో బ్రెజిల్ జట్టు 1958, 1962, 1970లలో ప్రపంచకప్ సాధించింది.