: నాగార్జునను బయటపడేసేందుకు రంగంలోకి దిల్ రాజు?
నటుడు నాగార్జున ప్రముఖ నిర్మాత దిల్ రాజు సాయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నాగార్జున ప్రస్తుతం ఓ భూ వివాదంలో చిక్కుకున్నారు. నాగార్జునకు మాదాపూర్ లో, శిల్పారామానికి సమీంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ (శుభకార్యాలు, సమావేశాల నిర్వహణకు) ఉంది. ఈ కన్వెన్షన్ సెంటర్ ఆధీనంలోని భూమిలో రెండు నుంచి మూడెకరాల వరకు చెరువు భూమిని ఆక్రమించినట్లు జీహెచ్ఎంసీ అధికారుల సర్వేలో తేలింది. దీంతో కన్వెన్షన్ సెంటర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని కమిషనర్ సోమేష్ కుమార్ మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. నాగార్జునకు టీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు లేవు. దీంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆయన దిల్ రాజు సాయం కోరవచ్చని... నాగార్జున తరఫున దిల్ రాజు తెలంగాణ సీఎం కేసీఆర్ లేదా ఇతర మంత్రులతో చర్చలు జరిపే అవకాశాలున్నట్లు ఓ ఆంగ్ల దిన పత్రిక కథనంగా రాసింది. ప్రస్తుత సమస్య నుంచి బయటపడేందుకు నాగార్జున అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నారని, అందులో దిల్ రాజుతో రాయబారం కూడా ఒకటని పేర్కొంది.