: చంబల్ లోయలో చివరి బందిపోటు కథ ముగిసింది!
మధ్యప్రదేశ్ లోని చంబల్ లోయ అంటే గుర్తొచ్చేది పూలన్ దేవి పేరే. బందిపోటు అవతారమెత్తి ఠాకూర్ల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించింది ఈ అపర కాళిక. ఆమెతో పాటు మాన్ సింగ్, పాన్ సింగ్ తోమార్ లు చంబల్ ప్రాంతంలో పేరుమోసిన బందిపోట్లు. వీరందరూ హతం కాగా, ఇప్పటిదాకా మిగిలిన వారిలో బాలక్ దిమార్ మోస్ట్ వాంటెడ్. ఇప్పుడు ఆ బందిపోటు సైతం హతమవ్వడంతో చంబల్ లోయలో బందిపోట్ల శకం ముగిసినట్టేనని మధ్యప్రదేశ్ పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
దాతియా జిల్లాలోని చెండ్వా అటవీప్రాంతంలో ఉన్న మహూదా మాతా మందిర్ లో జరిగిన కాల్పుల్లో బాలక్ ప్రాణాలు విడిచాడు. బాలక్ తో పాటు అతని ప్రధాన అనుచరుడు దినేశ్ జటావ్ కూడా హతమయ్యాడు. కాల్పుల అనంతరం ప్రేమా దిమార్ అనే బందిపోటును పోలీసులు అరెస్టు చేశారు. కాగా, బాలక్ తలపై రూ.50 వేల రివార్డు ఉంది. బందిపోటుగా ఎన్నో కిడ్నాప్ లకు పాల్పడిన బాలక్ దిమార్ ఎన్నడూ బందీలను చంపకపోవడం కొసమెరుపు.