: కపాలమే బంతి, ఎముకలే వికెట్లు... నెల్లూరులో శివపుత్రులు!


వాళ్ళంతా పదిపన్నెండేళ్ళ చిన్నారులు! చదువుసంధ్యలు లేనివాళ్ళు! శ్మశానం పక్కనే నివాసం! అందుకేనేమో, వారి ఆటపాటలకు ఆ వల్లకాడే వేదికైంది. ఆ పిల్లలు అక్కడ క్రికెట్ ఆడతారు. అయితే, కార్క్ బంతి, విల్లో బ్యాటుతో కాదు. మానవ కపాలమే వారికి బంతి... తొడ ఎముకలే వారికి వికెట్లు! ఇదంతా నెల్లూరు పట్టణంలోని బోడిగనిగుంట ప్రాంతంలో ఉండే చిన్నారుల గురించే. వైట్ నర్, గంజాయి, గుట్కా మత్తులో తూగడం వీళ్ళకు నిత్యకృత్యం. ఇక అమ్మాయిలైతే వ్యభిచారం బాటపడుతున్నారు.

తల్లిదండ్రులు అక్షరాస్యులు కాకపోవడం, సరైన ఉపాధి లేకపోవడం ఈ చిన్నారులు ఇలా తయారవడానికి కారణమవుతున్నాయి. ఇక్కడ సుమారు 300 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఎప్పుడో తమిళనాడు నుంచి వలసవచ్చిన ఈ వర్గానికి ఇక్కడ ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ ఉండవు. ఈ ప్రాంతం గురించి ఓ ఫిర్యాదు అందుకున్న బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఇక్కడి పరిస్థితి చూసి నిశ్చేష్టులయ్యారు.

పుర్రెలు, ఎముకలతో క్రికెట్ ఆడుతూ, అక్కడి శ్మశానంలో దహనసంస్కారాల సందర్భంగా సమర్పించే ఆహారపదార్థాలు తింటూ, చెత్త ఏరుకుంటూ కనిపించారట ఆ చిన్నారులు. వీరిని ఇక్కడి నుంచి తరలించి ప్రాథమిక సౌకర్యాలు, అవకాశాలు కల్పిస్తేనే జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందని ఈమేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ కు సూచించారు బాలల హక్కుల కమిషన్ సభ్యులు.

  • Loading...

More Telugu News