: పైప్ లైన్ పై చేయేస్తే ఆరేళ్లు జైలు శిక్షన్నారు: హర్షకుమార్
ఉభయగోదావరి జిల్లాల్లో గెయిల్, ఓఎన్జీసీ ఏర్పాటు చేసిన పైప్ లైన్లను ముట్టుకుంటే ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తామని ప్రజలను భయభ్రాంతులను చేశారని మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు. అమలాపురంలో ఆయన మాట్లాడుతూ, గతంలో అధికార పక్షం ఎంపీగా జిల్లాలోని పైప్ లైన్ల లీకేజీ విషయంలో మూడు సార్లు కేంద్రానికి లేఖ రాసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్యాస్ లీకేజీ వల్ల ప్రమాదాలు సంభవిస్తే నష్టపరిహారం చెల్లించాలనే అంశాన్ని చేర్చాలని కోరినా చమురు మంత్రిత్వ శాఖ బేఖాతరు చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోలియం శాఖ ప్రజల జీవితాలపై భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే గ్యాస్ వెలికితీత కార్యక్రమాన్ని కోనసీమ ప్రజలు వ్యతిరేకించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.