: రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు రేపుతున్న యూపీ గవర్నర్
ఉత్తరప్రదేశ్ గవర్నర్ అక్కడి రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు రేపుతున్నారు. ఉత్తరాఖండ్ గవర్నర్ గా 2012 నుంచి విధులు నిర్వర్తిస్తున్న అజీజ్ ఖురేషీ కొద్ది రోజుల నుంచి ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. మాజీ ప్రధాని వాజ్ పేయిని తన రాజకీయ గురువుగా అభివర్ణించే ఖురేషీ, యూపీ రాజకీయ నాయకులకు తలనొప్పిగా మారారు.
లక్నోలోని రాజ్ భవన్ లో ప్రతి రోజు సాయంత్రం 'జనతా దర్బార్' నిర్వహిస్తున్నారు. 'జనతా దర్బార్' ద్వారా ప్రజలు నేరుగా గవర్నర్ ను కలిసి తమ సమస్యలు విన్నవించుకోవచ్చు. దీనిపై రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గవర్నర్ 'జనతా దర్బార్' నిర్వహించడం ఏమిటి? అంటూ మండిపడుతున్నాయి. ఎలాంటి ప్రత్యక్ష అధికారాలు లేని గవర్నర్ కు 'జనతా దర్బార్' ను నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటూ కారాలు మిరియాలు నూరుతున్నాయి.
కాగా, దీనిపై ఖురీషీ స్పందిస్తూ ప్రజల సమస్యలు, రాష్ట్ర స్థితిగతులు తెలుసుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టలేరని అంటున్నారు. గవర్నర్ తీరుపై బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు యూపీ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్ పాయ్ ఫిర్యాదు చేశారు. గవర్నర్ తీరుపై అభ్యంతరం తెలిపారు.